Thursday 12 September 2013

సందర్శనీయ ప్రదేశాలు


  • ఆలంపూర్ దేవాలయాలు : తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు కలవు. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో క్రీ..7, 8వ శతాబ్దాలలో నిర్మితమైనాయి. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడ ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి.
  • పిల్లలమర్రి: మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్ మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
  • బీచుపల్లి: 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై కృష్ణానది పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
  • ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు: ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది ఆంద్రప్రదేశ్ లో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది గద్వాల నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది.
  • మన్యంకొండ దేవాలయం : మహబూబ్ నగర్ జిల్లా లోనే అతిపెద్ద దేవాలయం మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎత్తయిన కొండపై మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు మార్గంలో కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర జర్గుతుంది. కొండపై ఉన్న ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను ఆకట్టుకొంటుంది.
  • కోయిల్‌సాగర్ ప్రాజెక్టు:50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు.
  • కురుమూర్తి దేవస్థానం: తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో పోలికలున్న కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం క్రీ..14 వ శతాబ్దానికి చెందినది. ఇది చిన్న చింతకుంట మండలంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరడానికి రైలుమార్గం కూడా ఉంది.
  • ఉమా మహేశ్వర క్షేత్రం : నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. ఇది శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో ఉంది కాబట్టి శ్రీశైలం వెళ్ళు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తారు. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉండటం కూడ భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
  • గద్వాల కోట : సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. కోట లోపలే ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. కోటలోని స్థలాన్ని కళాశాలకు ఇచ్చినందున కళాశాల పేరు కూడా మహారాణి ఆదిలక్ష్మీ డిగ్రీ కళాశాలగా చెలమణిలో ఉంది. కోట పరిసరాలలో గతంలో సినిమా షూటింగులు కూడా జర్గాయి.
  • శిర్సనగండ్ల దేవాలయం : అపరభద్రాద్రిగా పేరుగాంచిన క్రీ..14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం వంగూరు మండలంలో ఉంది. ఇక్కడ ప్రతిఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు.
  • చంద్రగఢ్ కోట : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో మొదటి బాజీరావు కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది ఆత్మకూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో నర్వ మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.

  • రాజోలి కోట మరియు దేవాలయాలు :పురాతనమైన రాజోలి కోట మరియు కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.

No comments:

Post a Comment