Thursday 12 September 2013

జిల్లా రాజకీయాలు

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకె అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితర ప్రముఖులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు. ప్రస్తుత మంత్రివర్గంలో గద్వాల శాసనసభ్యురాలు డి.కె.అరుణ కొనసాగుతుంది.


పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.

No comments:

Post a Comment